Welcome to the BLISSFUL journey

Day 9 – అమ్మగారి సాన్నిధ్యమే దేవాలయం

0

DRDO ముస్సోరీలో  మరుసటి రోజు, శాస్త్రవేత్తల కోసం ఏర్పాటు కానున్న సుషుమ్న క్రియా యోగ ధ్యాన కార్యక్రమం ఏర్పాట్లు మేము ముస్సోరీ చేరిన రోజు సాయంత్రం నుండే ప్రారంభించాం. ధ్యాన కార్యక్రమాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్వహించాలి కాబట్టి అమ్మగారు అందరికీ బాధ్యతలు అప్పగించి బాగా చేయమని దీవించారు. మరుసటి రోజు జరగబోయే కార్యక్రమానికి ఏర్పాట్లను కొంత మంది, అమ్మగారు చెప్పిందే తడవుగా ప్రారంభించే శారు. సకల దేవి దేవతలు, సిద్ధులు, అవధూతలు, మహా మహా యోగులందరూ అమ్మగారితోనే , అమ్మగారిలోనే  ఉంటారు కనుక, అమ్మగారి సాన్నిధ్యమే సుషుమ్న క్రియా యోగులకు దేవాలయం. ఈ విషయాన్ని కొందరు గ్రహించి అమ్మగారు చెప్పిన పనిని వెంటనే ఆరంభించేశారు. మరి కొందరు దగ్గర్లోని శివాలయానికి వెళ్లి ఆ తరువాత పనులు ప్రారంభించాలనుకుని శివాలయానికి బయలుదేరారు. మాకు బస ఏర్పాటు చేసిన ప్రదేశం నుండి 15 నిమిషాల నడక సాగించాక కనపడింది ఆ శివాలయం. ఆలయం చిన్నదిగా ఉంది. కానీ పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఆలయం అది. ఆలయంలోనికి ప్రవేశిస్తుండగానే మంచి సువాసనలు. అక్కడ ధుని నుండి చాలా మంచి వాసన వెలువడుతోంది. శివుడి పక్కనే అమ్మవారిని కూడా ప్రతిష్టించారు. ఆ ఆలయంలో కాసేపు ధ్యానం చేశాo. ఉత్తరాది ఆలయాల్లో అధికంగా విగ్రహాలు పాలరాయితోనే ఏర్పాటు చేయటం గమనార్హం. అయితే ఆ ఆలయం పురాతనమైనది కాదు. కొత్తగా నిర్మించబడింది. ఆ ఆలయంలో కాసేపు ధ్యానం చేసుకొని తిరిగి DRDO కార్యాలయం చేరాం. అక్కడికి వెళ్ళగానే శ్రీ శంకర్ కిశోర్ గారు అమ్మగారితో పాటుగా మాకు దీక్షా కార్యక్రమo జరగనున్న హాలు చూపించారు. అక్కడి సిబ్బందికి సీటింగ్ ఏర్పాట్లు అవీ అప్పగించి భోజనానికి వెళ్ళాం. భోజనం అయ్యాక 10 గంటల ప్రాంతంలో అందరం విశ్రమించేందుకు వెళ్ళాం. ఆ రోజు అనిపించింది అయ్యో అప్పుడే చీకటి పడిపోయిందే అని!! అమ్మగారితో మా యాత్రలో అప్పుడే ఒక రోజు గడిచిపోయిందే! అని ఒక వంక బాధ, మరొక వంక మరుసటి రోజు ఉదయం దీక్షా కార్యక్రమాన్ని గురించి ఆలోచన.11 గంటలప్పటి నుండి ఎముకలు కొరికే చలి మొదలైంది.  దుప్పట్లలో మునగ తీసుకొని అందరం నిదురించాం.

Share.
Leave A Reply