Browsing: Himalayanam

మా హిమాలయ యాత్ర ప్రారంభమైంది. ప్రయాణం ఆరంభం నుండే సత్ సంగం ఆరంభించాం. ఒక్కొక్కరు, అమ్మగారి వద్ద దీక్ష తీసుకున్నాక వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను గురించి చెప్పుకొచ్చారు.హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఇంచు మించు 3 గంటల పాటు సాగిన మా ప్రయాణం 3 నిమిషాల్లా సత్ సంగంతో ఎంతో సాఫీగా సాగిపోయింది. ఢిల్లీలో 1 గంట సేపు ఆగిన విమానం డెహ్రాడూన్పయనమయ్యేందుకు నింగికి ఎగసింది. ఢిల్లీ నుండి డెహ్రాడున్కు కేవలం గంట మాత్రమే ప్రయాణం. మా ప్రయాణాంతరం డెహ్రాడూన్ చేరాం. అక్కడ వాతావరణం శీతలంగా ఉంటుందేమో అనుకున్నాం కానీకొద్దిగా వేడిగానే అనిపించింది అక్కడి వాతావరణం.మరో పక్క లగేజీతో ఎయిర్పోర్ట్ బయటకి వచ్చాము. అక్కడ వాహనాలు అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇతర నగరాల నుండి వస్తోన్న మరి కొంత మందినిఅదే వాహనాల్లోకి ఎక్కించుకొని ముస్సోరీకి బయలుదేరాం.  ఇన్నోవాల్లో మా ప్రయాణం ప్రారంభమైంది. ఆధునికంగా కనిపించే రహదారులతో, చక్కటి పచ్చికతో చాలా బాగుంది ఆ ప్రదేశం. మహా నగరాల్లోరోడ్లలాగా కాక కొద్దిగా సన్నగా ఉన్నాయక్కడ రోడ్లు. అలా ముందుకు సాగాక ఎత్తైన పర్వతం ఒకటి కనిపించింది. ఆ పర్వతపు శిఖరాగ్రం దట్టంగా కప్పబడిన మబ్బుల వల్ల కనపడటం లేదు. “ఆ పర్వతం పైకేమన ప్రయాణం” అన్నాడు డ్రైవర్. రయ్యి మంటూ దూసుకు పోతోంది మా కారు. మంచి హస్తలాఘవంగా స్టీరింగ్ తిప్పుతున్నాడు డ్రైవర్. దట్టమైన, పొడవైన చెట్ల నడుమ నుండి పైకి సాగిపోతున్నాం. దారిఅంతా మెలికలే. పర్వతం పైకి కారు వెళుతోన్న కొద్దీ, చెవుల్లో చలి గాలికి గుయ్యిమంటూ చప్పుడు. చలి కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పర్వతం పైకి సాగేకొద్దీ, అక్కడ నిర్మించిన అందమైన ఇళ్లు, కొన్నికట్టడాలు, పర్వతం పై నిర్మితమైన చిన్న గ్రామాలు దర్శనమిచ్చాయి.