Welcome to the BLISSFUL journey

Day 49 – మాతృమూర్తి జయంతమ్మ కారణంగా ఉపవాసం విడిచిన అమ్మగారు

0

అమ్మగారు చెబుతోన్న ఆసక్తికర విషయాలను వింటోన్న మాకు అమ్మగారే సమయం గుర్తు చేస్తూ, “ఇక ఆలస్యం కాకుండా బయలుదేరండి” అన్నారు.
“పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకోండి, పరిస్థితుల్ని సరిగ్గా నిర్వహించే సామర్థ్యం, మానసిక పరిపక్వత పెరిగితే నిజమైన యోగులవుతారంటూ చెబుతుండగా…..
ప్రశాంతమ్మ, అమెరికాలో ఉన్న అమ్మగారి శిష్యురాలిని గురించి ప్రస్థావించారు. అమ్మగారు, మౌనంగా, అన్న పానాదులు స్వీకరించకుండా ఉన్న రోజు, అమెరికా నుండి సమీర గారు ప్రశాంతమ్మకు ఫోన్లో సందేశం పంపారట. “అమ్మా, నాకు నిన్నటి ధ్యానంలో అమ్మగారు ఏదో దిగులుగా ఉన్నట్లు కనపడింది. విషయమేంటో తెలియ చెయ్యగలరు…” అంటూ రాసి పంపారట. “అమ్మగారికి ఏమైందో తెలియటం లేదు. మన పట్ల కోపంతో ఏమీ తినటంలేదు అనుకున్నాను అందుకే అప్పుడు ధ్యానంలో మా జయంతమ్మను పిలిచాను, అప్పుడు మాత్రమే కొద్దిగా అల్పాహారం తిన్నారు అమ్మగారు” అన్నారు ప్రశాంతమ్మ.
అమ్మగారు ఆ విషయాన్ని మరింతగా విశదీకరిస్తూ……
“పరిస్థితికి అనుగుణంగా ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేదాని బట్టే శిష్యుల కర్మ క్షయం కూడా జరుగుతుంది” అన్నారు అమ్మగారు.” మీలో ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఆ సమయంలో అన్నది మీకు తెలుస్తుంది. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ అమ్మాయికి నా స్థితి తెలిసింది అంటే, అందుకు గురువుతో సరైన సమన్వయము కుదరటం వల్లే, నేను మీ కళ్ళ ఎదుట ఉన్నా నా భావాలు మీరు కనుక్కోలేకపోయారు” అన్నారు అమ్మగారు. మిగిలిన విషయాలు గురుపౌర్ణమికి కలసినప్పుడు మాట్లాడదాం ఇక బయలుదేరండి అన్నారు అమ్మగారు.

ప్రత్యక్ష గురువు కోసం జన్మల పాటు వేచి చూసే మనం, కేవలం గురు సమక్షాన్నే కాదు, గురు తత్వాన్ని తెలుసుకోవాలని అవగతమైంది. ఎన్నో దివ్యానుభవాలు, మరెన్నో గుణ పాఠాలు నేర్పించిన హిమాలయ యాత్ర అందరి జీవితాల్లో సంభవించిన ఒక మధురానుభవం, జీవితాల్ని మలుపు తిప్పిన ఒక విలక్షణ ఘట్టం. ఆ రోజు అమ్మగారి వద్ద అందరం సెలవు తీసుకొని, బరువెక్కిన హృదయాలతో, అశ్రువులు నిండిన కళ్ళతో అమ్మాగారి పాదాలకు నమస్కారాలు చేసుకొని ఆ సాయంత్రానికి గృహాలకు చేరాం.

Share.
Leave A Reply