Welcome to the BLISSFUL journey

జీవన్ రెడ్డి అనుభవాలు

0

సుషుమ్న క్రియా యోగములో చాలా మంది అమ్మగారితో ధ్యానముతో కనెక్ట్ అయిన వారే … ఏ దృశ్యాన్ని మెడిటేషన్ లో చూసినా, ఏ అనుభూతి కలిగినా వెంటనే అమ్మగారితో చెప్పేసుకుని, సందేహము తీర్చుకునే వారే ….దూరంగా ఉండి ధ్యానము ద్వారా అమ్మగారితో కనెక్ట్ అయి ,మార్గదర్శకత్వము పొందేవారు కొందరు….కానీ జీవన్ గారి ఆధ్యాత్మికమైన ఎదుగుదల చాలా విచిత్రముగా జరిగింది…జీవన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ …దేనిపైనా పెద్ద నమ్మకము కానీ,దేనికీ ఎక్కువగా స్పందించడము కానీ తెలియనట్లు ఉండే వ్యక్తి.వీరి సహచరి వంశీ కృష్ణ కుమారి గారు ఆరోగ్య సమస్యతో సుషుమ్న క్రియా యోగం అభ్యసించినప్పుడు, ఆ తరవాత ఆమెకు ఎనర్జీ ఫ్లో జరుగుతుంది అని చెప్పినప్పుడు పట్టించుకున్నట్లు కనబడే వారు కాదు జీవన్.మీరు కూడా ధ్యానము చెయ్యండి ,ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళతారు అని చెప్పినప్పుడు ” నాకదేమీ అక్కర్లేదు – నువ్వు చేసుకో”…అనేవారు.ఒకరోజు వంశీ ధ్యానము చేసుకుంటుంటే ,పక్కనే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న జీవన్ కు ఎదో చల్లగా అలలు అలలుగా తనను తాకినట్లు అనిపించింది. అలా రెండు సార్లు గమనించిన తరవాత,”వంశీ! నువ్వు ధ్యానం చేస్తూ వుంటే నాకు కూడా ఎనర్జీ తెలుస్తోంది” – అని కొంచెము ఆశ్చర్యంగా చెప్పారు…. “అంటే జీవన్ కూడా ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు”… అని మరొక సుషుమ్న క్రియా యోగి చెప్పగా ,సరే నేను కూడా ధ్యానం చేసి చూస్తాను – అని ఒప్పుకున్నారు జీవన్….వంశీతో మెడిటేషన్ క్లాస్ కి వచ్చినప్పుడు ధ్యానం కన్న సర్వీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టే వారు జీవన్.తిరుపతి క్లాస్ లో అమ్మగారు జీవన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి అని విజయగారితో చెప్పారు.అది విని జీవన్ కు ఆశ్చర్యము ,ఆనందము అనిపించాయి.తిరుపతి గురు పౌర్ణమి తరవాత కలలో తన వెనకాల ఎవరో ఒకతను 16 సంవత్సరాల యోగి తనను అనుసరిస్తున్నట్లు ,తన ఆఫీస్ లో టేబుల్ పైన కనబడి తనలో కలిసిపోయినట్లు కనిపించింది.భయపడి రెండు సార్లు మేలుకున్నా తిరిగి అదే కల జరుగుతున్నట్లే ఉన్నది.ఇది జరిగిన కొద్ది రోజులకు ముగ్గురు గురువుల పఠాల పక్కన తెల్ల చీరలో ఒక మాతాజీగారు కూర్చున్నట్లు కనబడ్డారు జీవన్ కు ….ఈ దృశ్యాలకు అర్థం ఏమిటా? అన్న సందిగ్ధంలో ఉన్న జీవన్ గారికి, అతనితో పాటు నీడగా కనబడి అతనిలో కలిసిపోయినది అతని (గత జన్మ)సూక్ష్మ రూపమని,పూజ్యులైన గురువుల చెంత కనబడి ఆశీర్వదించిన దివ్య స్వరూపము సాక్షాత్ శ్రీ బాబాజీ గారి సోదరి శ్రీ నాగలక్ష్మి మాతాజీ గారని వివరించారు అమ్మగారు.సర్వీస్ మనస్ఫూర్తిగా చేస్తూ చక్కటి “ట్యూనింగ్ “లో ఉండడము వలన అక్కడ జరుగుతున్నవి చూడగలిగాడు జీవన్ అని అమ్మగారు ఆశీర్వదించారు.ఏనాడు ఎవరి మాట పెద్దగా పట్టించుకోని జీవన్ కు ఇప్పుడు అమ్మగారి ప్రతి మాట, కదలిక,చూపు శిరోధార్యాలే .జీవన్ గారికి ఎవరితోనూ లోతైన అనుబంధముకానీ, ఎమోషనల్ అటాచ్ మెంట్ కానీ పెద్దగా లేవు అన్నట్లుగా ఉన్నా,అమ్మగారితో ఉన్న అనుబంధములో దైవీకమైన ప్రేమ,భక్తి,ఆరాధన ఉంటాయి.అందుకే ఎందరి మధ్య ఉన్నా,ఎంత ఆకర్షణీయమైనవి చుట్టూ కళ్లు చెదిరేలాగా జరుగుతున్నా,జీవన్ దృష్టి,ఏకాగ్రత అమ్మగారి మీద మాత్రమే ఉంటుంది.దైవీకమైన గురువుగారి ఆశీర్వ చనము ఉంటే,నిష్కామంగా సర్వీస్ చేస్తే ఏమేమి అద్భుతాలు జరగవవచ్చును? అంటే ,సామాన్య స్థితి నుంచి వృత్తిలో గొప్ప స్థితి, మంచి పాకేజీ, సుషుమ్న క్రియా యోగ సెంటర్ గా ఉపయోగపడే అద్భుతమైన ఇల్లు ,ఆఫీస్ లో టెన్షన్ , స్ట్రెస్ తట్టుకోగలిగిన శక్తి , సహనము , కోపం తగ్గిపోవడము, ప్రాపంచిక విషయాల్లో అంటి ముట్టనట్లు ఉండగలగడము, – ఇవన్నీ అతనిలో అతనికే అర్థమైన మార్పులు అంటారు జీవన్.ఒకప్పుడు ఖరీదైన కార్లు, ఇల్లులు, అందర్లోకి అత్యున్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచించిన అతనికి ఇప్పుడు బ్యాలన్స్ వచ్చింది.ఈ భూమి మీదకు వచ్చిన పని పూర్తి చేసుకుని,నిరంతరము గురువు కనెక్షన్ లో ఉంటూ ,ఈ జనన మరణ చక్రాల నుంచి విడివడాలన్నదే లక్ష్యం,గమ్యం అనుకునే ఈ ముప్పై మూడేళ్ళ ఇంజనీర్ చాలా మంది తోటి వారికి అర్ధం కాని పజిల్.
అతడి గత జన్మల గురించి చెబుతూ ” ఇన్ని జన్మలుగా జీవన్ ఒకేలాగా ఉన్నాడు.గురువు ఏం చెబితే అదే ,ఎంత చెబితే అంతే ” అని అమ్మగారు జీవన్ గత జన్మల గురించి కూడా చెప్పినప్పుడు దేనికీ చలించని జీవన్ కళ్లల్లో ఆనందపు నీటి పొర చూశాను అంటారు వారి జీవన సహచరి , సుషుమ్న క్రియా యోగి అయిన వంశీ కృష్ణ కుమారి గారు.వంశీ గారు యోగములో చేరిన మొదటి రోజుల్లో ,జీవన్ ను అసలు చూడనప్పుడే ,వంశీ మంచి సర్వీసు చేస్తుంది – అన్నప్పుడు వంశీ భర్త జీవన్ మరింత గొప్ప సర్వీస్ చేస్తారు .. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అతడిని కలుసుకుని రండి అని మూర్తి గారికి ఆదేశం ఇచ్చారట అమ్మగారు.చాలా రోజుల తరవాత ఈ విషయం తెలిసిన జీవన్ ఆశ్చర్యపోయారు….ఎప్పుడూ సరిగ్గా ధ్యానం చెయ్యడు…గురువుల పఠం దగ్గర కూడా పది నిమిషాలు నిలబడని జీవన్ ఎప్పుడూ నాతో కనెక్టెడ్ గా ఉంటాడు అని అమ్మగారు ఎలా అన్నారా?!అని అమాయకంగా ఆలోచించే వంశీకి, జీవన్ కు ఆరోగ్యము చాలా దెబ్బ తిన్నప్పుడు కలలో అమ్మగారు వచ్చి తైలం తెమ్మని అతని ముక్కులో రెండు చుక్కలు వేసి,గొంతు తడిమారు.ఆ మర్నాటి నుంచి అప్పటి వరకు ఏమీ పని చెయ్యని మందులు అద్భుతంగా పనిచేసి ఆరోగ్యవంతులయ్యారు జీవన్.జీవన్ ఎంత కనెక్టెడ్ గా ఉండకపోతే అమ్మగారు అట్లా స్వప్న దర్శనమిచ్చి అతణ్ణి కాపాడుతున్నారు?! అని ఆశ్చర్యపోయారు అతని యోగ మిత్రులు.
ఏ మాత్రము ఆధ్యాత్మికత కనబరచకుండా ,చాలా లౌకిక ప్రపంచానికి సంబంధించినట్లు ఉన్న జీవన్ వంటి వారిని ఎన్నో జన్మలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తించి, ఆధ్యాత్మికపు అక్కున చేర్చుకున్న పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అంతః నేత్రానికి అన్నీ ఎరుకే….ఈ అతి ముఖ్య విషయాన్ని అర్థం చేసుకున్న సుషుమ్న క్రియా యోగులకు నిరంతరమూ గురు సన్నిధానమే ఆశీర్వ చనము.

Share.

Comments are closed.