Welcome to the BLISSFUL journey

Day 34 – భాగీరథీ నది ఒడ్డున అమ్మగారు జరిపించిన ప్రక్రియ

0

గంగమ్మ ప్రవాహం వెంట సాగుతూ ఉన్న రహదారిపై ప్రయాణిస్తూ, మరుసటి రోజు గంగోత్రి ఆలయానికి వెళ్లేందుకు భాగీరథీ నది ఒడ్డున  రిసార్టుకు   చేరాం. అమ్మగారు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఒక్క 20 నిమిషాలు, అరగంట వ్యవధిలో మా బస్సులు కూడా అక్కడికి చేరాయి. లోపలికి అడుగు పెడుతుండగా పచ్చటి యాపిల్ పళ్ల తోట కనిపించింది. యాపిల్ పళ్ళు చెట్లకు విరివిగా కాసాయి. భాగీరథీ నదీ ప్రవాహ నాదం, ఓంకార నాదంలా వినిపిస్తోందక్కడ. మేము చేరేలోపే అమ్మగారు శిష్యులందరికీ తెలియ చేయమంటూ ఉత్తర్వులు పంపారు. ఆ ప్రదేశంలో సకల దేవతా గణం, ఋషులు, మహా తప: సంపన్నులు ఉన్నారని, ముఖ్యంగా ప్రమథ గణం ఆ స్థలంలో సంచరిస్తున్నట్లు చెప్పి, అందరూ భావాన్ని, మౌనాన్ని పాటించాలని ఆదేశించారు. రిసార్టు  చేరాక అమ్మగారిని మేము ఎవ్వరం చూడలేదు. అమ్మగారు కాటేజిలోనే ఉన్నట్లు తెలుసు. అక్కడికి చేరిన కొద్ది సేపటికే సమీపంలోని ఒక ప్రదేశానికి వెళ్లేందుకు అందరినీ మళ్లీ బస్సుల్లో కూర్చోమన్నారు.  అందరం బస్సుల్లో రిసార్టుకు సమీపంగానే ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళాం. పూర్తి ఏకాంతం నిండిన ప్రదేశం అది. అందరం మౌనంగానే ఉంటూ, అమ్మగారి అడుగులను అనుసరిస్తూ ముందుకు కదిలాం. అమ్మగారి నడకలో చాలా మార్పు. ఎంత శీఘ్రoగా, శెరవేగంగా నడుస్తున్నారంటే, యువ బృందంలోని మగ పిల్లలు సైతం పరుగులు పెట్ట వలసి వచ్చింది. ఆయాస పడుతూ ఉరుకులు పరుగులుగా అమ్మగారి వెంట వెళ్లిన మేము, సరిగ్గా నది ఒడ్డున ఆగాం. అది కొండ ప్రదేశం.మా ఎదురుగా పెద్ద పెద్ద కొండల వరుస. ఎత్తైన శిఖరాగ్రాలతో, పచ్చదనం, మట్టి రంగు కలగలసినట్లు కనపడుతున్నాయి ఆ కొండలు. మాకు కుడి భాగంలో దూరంగా ఒక బంగారు పర్వతం. అక్కడి నుండి మా వైపుగా గంగా ప్రవాహం. గంగ ఒడ్డునే ధ్యానానికి కూర్చున్నాం. ఆ రోజు, ధ్యానానికి ముందు వేరొక శ్వాస ప్రక్రియ చేయించారు అమ్మగారు. అందరం ధ్యాన స్థితిలో లయం అయ్యాం. మాలో కొందరికి అద్భుతమైన అనుభవాలు వచ్చాయి. వంశీ గారికి ఒక ఋషీశ్వరులు, ఒక నార చీర కట్టుకున్న పొడుగాటి ఆవిడ, జుట్టు విరబోసుకొని కనపడ్డారట.

Share.
Leave A Reply